: కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య బీ-ఫారం అందుకున్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో రాజయ్య గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వాల నిజస్వరూపాన్ని వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలు గమనించారన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ, తనను లోక్ సభ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి, నేతలకు కృతఙ్ఞతలు తెలిపారు. వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 21వ తేదీన వరంగల్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాన్ని ప్రకటిస్తారు.