: తక్కువ ధరకే టాంజానియా కందిపప్పు!
కందిపప్పు ధరలు ఆకాశాన్నంటడంతో పప్పు జోలికెళ్లాలంటేనే పేద, మధ్య తరగతి ప్రజలకు భయం పుడుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు లభించే టాంజానియా కందిపప్పును మార్కెట్లోకి దింపి భారీగా లాభాలు గడించే పనిలో వ్యాపారులు ఉన్నారు. ఈ కందిపప్పు ధర కిలో రూ.85 నుంచి రూ.90 మధ్య ఉంది. దీంతో టాంజానియా కందిపప్పును కొనుగోలు చేసేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, కర్నూలు ప్రాంతాలకు దళారుల ద్వారా సరుకు పంపుతున్నారు. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా కొనసాగిస్తున్నారు. హోటళ్లలో, మెస్ లలో, విద్యా సంస్థలకు చెందిన హాస్టళ్లలో ఈ కందిపప్పునే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం. అంతగా నాణ్యతలేని టాంజానియా కందిపప్పు వండిన తర్వాత రెండు గంటల కంటే ఎక్కువ సేపు నిల్వ ఉండదు. స్థానికంగా మన కందిపప్పును తినడానికి అలవాటు పడిన వారు ఈ కందిపప్పును తినడం కొంచెం కష్టమైన పనే అయినప్పటికీ పేద, మధ్య తరగతివారికి విక్రయిస్తున్నట్టు వ్యాపారులు చెప్పారు. కందిపప్పు ధరలు విపరీతంగా పెరగకముందు టాంజానియా కందిపప్పు ధర కిలో రూ.40 నుంచి రూ.50 మధ్యన ఉండేదని వారు చెప్పారు. టాంజానియా కందిపప్పు గురించిన వివరాలు చెప్పిన తర్వాతే వినియోగదారులకు విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ పప్పు వాడకం వల్ల వచ్చే అనర్థాలపై అధికారులకు ఎటువంటి అవగాహన లేకపోవడంతో వ్యాపారం యథేచ్చగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.