: డివిలియర్స్ సెంచరీ...ప్రాక్టీస్ టెస్టు డ్రా
భారత్ ఎలెవెన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ను సౌతాఫ్రికా జట్టు డ్రాగా ముగించింది. నవంబర్ 5 నుంచి భారత్ తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ ఎలెవెన్ తో మూడు రోజుల మ్యాచ్ ఆడింది. టీట్వంటీని, వన్డే సిరీస్ ను గెలుచుకుని మంచి ఉత్సాహంతో ఉన్న సౌతాఫ్రికా జట్టు కొత్త ముఖాలతో బరిలో దిగింది. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంది. 46/2 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా జట్టును శార్థుల్ ఠాకూర్ (4/70) టాపార్డర్ ను కట్టడి చేశాడు. అనంతరం బరిలో దిగిన డివిలియర్స్ (112) వన్డే సిరీస్ లో చెలరేగిన తరహాలో మిడిలార్డర్, టెయిలెండర్లను అడ్డం పెట్టుకుని రెచ్చిపోయాడు. దీంతో 302 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. అనంతరం భారత ఆటగాళ్లు పుజారా (43), కేఎల్ రాహుల్ (49) లు బ్యాటింగ్ చేశారు. మూడు రోజుల ఆట ముగియడంతో మ్యాచ్ ను అంపైర్లు డ్రాగా ప్రకటించారు. కాగా, పుజారా, రాహుల్ లకు టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు మంచి ప్రాక్టీస్ లభించింది.