: అహ్మదాబాదులో తల్వార్ గ్యాంగ్ స్వైరవిహారం... కలకలం రేపుతున్న వీడియో ఫుటేజీ
గుజరాత్ లో కల్లోల పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా పటేళ్లకు ఓబీసీ కోటా కోసం యువ సంచలనం హార్దిక్ పటేల్ చేపట్టిన పోరు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ గొడవ సద్దుమణిగిందో, లేదో ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాదులో తల్వార్ గ్యాంగ్ స్వైరవిహారం చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలోని ఓ ప్రముఖ బిల్డర్ కార్యాలయంలోకి నలుగురైదుగురు యువకులు కత్తులు చేతబట్టి చొరబడ్డారు. కార్యాలయంలో కనిపించిన వారిపై దాడికి దిగారు. కార్యాలయం నుంచి బతుకు జీవుడా అంటూ బయటకు పరుగు తీసిన ఓ వ్యక్తిని ఆ దుండగులు వెంటబడి మరీ కొట్టారు. అంతటితో కోపం చల్లారని ఆ గ్యాంగ్ కార్యాలయ ఆవరణలోని ఖరీదైన కారును ధ్వంసం చేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధిత బిల్డర్ కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. న్యూస్ చానెళ్ల దరి చేరిన ఈ వీడియో ఫుటేజీ నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.