: హిప్నాటిజం చేసి.. బ్యాంక్ మేనేజర్ దగ్గర సొమ్ము కొట్టేశాడు!
హిప్నాటిజం... ఓ అద్భుతమైన కళ. అవతలి వ్యక్తిని పూర్తిగా మన కంట్రోల్ లోకి రప్పించుకోవడమే హిప్నాటిజం. తాజాగా ఇదే హిప్నాటిజంను ఉపయోగించుకుని... ఏకంగా బ్యాంకు మేనేజర్ నే దోచుకున్నాడు ఓ వ్యక్తి. ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా దాదర్ బ్రాంచికి గత మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా మేనేజర్ భూపేంద్ర కుమార్ మణిరామ్ (52) వద్దకు వెళ్లి, తనను శర్మగా పరిచయం చేసుకున్నాడు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ డెవలెప్ మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ)లో ఆఫీసర్ గా పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. వికలాంగుడైన తన సోదరుడికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చానని మేనేజర్ తో శర్మ చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని అడుగుతూనే... ఎంహెచ్ఏడీఏలో ఫ్లాట్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని భూపేంద్ర కుమార్ కు శర్మ ఆఫర్ చేశాడు. కొంత డబ్బును తక్షణమే సర్దుబాటు చేయాలని కోరాడు. అంతేకాదు, మాటలతో బ్యాంక్ మేనేజర్ అడ్రస్ డీటెయిల్స్, పాన్ కార్డ్ సమాచారం తదితర వివరాలను సేకరించి... ఫోన్ లో ఇతర వ్యక్తికి చేరవేశాడు. వాస్తవానికి తానేం చేస్తున్నాడో బ్యాంక్ మేనేజర్ కు తెలియడం లేదు. ఏదో ట్రాన్స్ లో అంతా చేస్తున్నట్టు ఉంది. సీన్ కట్ చేస్తే, క్యాషియర్ వద్దకు వెళ్లిన మేనేజర్ అతని వద్ద నుంచి రూ. 90 వేలను తీసుకుని, తనవద్ద ఉన్న మరో రూ. 3 వేలను కలిపి మొత్తం రూ. 93 వేలను శర్మ చేతిలో పెట్టేశారు. ఇది జరిగిన 10 నిమిషాల తర్వాత మేనేజర్ భూపేంద్ర కుమార్ వాస్తవ లోకంలోకి వచ్చారు. తాను మోసపోయానని తెలుసుకున్నారు. అప్పటికే శర్మ అనే వ్యక్తి రూ. 93 వేలతో ఉడాయించాడు. దీంతో, భూపేంద్ర దాదర్ పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు నుంచి సీసీటీవీ ఫుటేజీని తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. డబ్బు ఎత్తుకెళ్లిన శర్మ అనే వ్యక్తి ఎంహెచ్ఏడీఏలో పనిచేయడం లేదని తేలింది. అయితే, హిప్నాటిజం ద్వారా డబ్బులు దోచుకోవడం ఇదే తొలిసారని ముంబై పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.