: నడిరోడ్డుపై కొబ్బరి బోండాం తాగిన చంద్రబాబు...నెల్లూరు ప్రజలతో మమేకమైన ఏపీ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం నెల్లూరు నగర ప్రజలతో మమేకమయ్యారు. నిన్న నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు రాత్రి అక్కడే బస చేసి నేటి ఉదయం తెల్లవారకముందే నగర వీధుల్లోకి వచ్చేశారు. నగరంలోని వెంగళరావునగర్, దర్గామిట్ట, రాంనగర్, గాంధీనగర్, బ్రహ్మానందపురం తదితర ప్రాంతాల్లో కలియదిరిగిన ఆయన ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రబాబు ఆరా తీశారు. పారిశుద్ధ్యంపై అధికారులకు క్లాస్ పీకారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు పక్కగా కొబ్బరి బోండాలు అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లారు. ఆమె ఇచ్చిన కొబ్బరి బోండాంను స్వీకరించిన చంద్రబాబు అక్కడే రోడ్డుపై నిలబడే కొబ్బరి నీటిని తాగారు. ఆ తర్వాత ఆ మహిళతో కొద్దిసేపు ముచ్చటించి అక్కడి నుంచి కదిలారు.