: వెంకయ్య ‘వారసురాలి’ ఆధ్వర్యంలో ఢిల్లీ ‘వైభవోత్సవాలు’... రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు!


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయ వారసత్వంపై మరోమారు చర్చకు తెర లేచింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న తిరుమల వెంకన్న వైభవోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలన్నీ వెంకయ్య కూతురు, స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ముప్పవరపు దీపా వెంకట్ ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయి. తిరుమల వెంకన్న ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ అక్కడ నిర్వహిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఢిల్లీ వాసులకు తిరుమల రాకుండానే వెంకన్న సేవా భాగ్యాన్ని కల్పిస్తున్నారు. నిన్న ప్రారంభమైన ఈ వేడుకలకు వెంకయ్యతో పాటు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా హాజరయ్యారు. వేడుకలు జరిగే పది రోజుల్లో ఏదో ఒక రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వైభవోత్సవాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలో వెంకయ్య రాజకీయ వారసురాలు తెరంగేట్రం చేయనున్నారన్న చర్చ ఒక్కసారిగా జోరందుకుంది. వెంకయ్యకు ఓ కొడుకు, కూతురు ఉన్నా, కొడుకు పేరు ఏనాడు బయటకు రాలేదు. కూతురు దీపా వెంకట్ మాత్రం స్వర్ణభారతి మేనేజింగ్ ట్రస్టీ హోదాలో నిత్యం ప్రజాసేవలోనే తరిస్తుంటారు. అప్పుడప్పుడు తండ్రి వెంట ఆమె కూడా పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఇక రాజకీయ తెరంగేట్రం గురించి నిన్న ఆమెను మీడియా కూడా ప్రశ్నించింది. మీడియా ప్రశ్నలకు స్పందించిన దీపా వెంకట్, వెంకయ్యకు వారసురాలినేనని ప్రకటించారు. అయితే రాజకీయ వారసురాలిని మాత్రం కాదన్నారు. రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న చర్చ మొత్తం ఊహాజనితమేనని ఆమె కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News