: ముంబై బీచ్ ఒడ్డున బూర్జ్ ఖలీఫాను మించిన భవనం... నితిన్ గడ్కరీ మనసులోని కోరిక!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిరకాల వాంఛను బయటపెట్టారు. దుబాయ్ కు అంతర్జాతీయ స్ధాయిలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన బూర్జ్ ఖలీఫా లాంటి భవంతి ముంబై బీచ్ ఒడ్డున ఉంటే చూడాలని ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది అధికారిక ప్రకటన కాదని స్పష్టం చేసిన ఆయన, మరాఠా యోధుడు శివాజీ పేరుతో అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్న చిరకాల కోరిక ఉందని గడ్కరీ తెలిపారు. ఈ అత్యంత ఎత్తైన భవనంలో 30 అంతస్తులు కేవలం సమావేశాల కోసమే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరో 30 ఫ్లోర్లు రెస్టారెంట్లు, మరో 30 ఫ్లోర్లు హోటల్స్, 20 ఫ్లోర్లలో షాపింగ్ మాల్స్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వీటన్నింటికీ సరిపడినన్ని పార్కింగ్ ఫ్లోర్లు ఉండాలని గడ్కరీ తెలిపారు. దీనికి ఛత్రపతి శివాజీ పేరు ఉండాలని, అది బూర్జ్ ఖలీఫా కంటే ఎత్తైనదిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.