: అమ్మాయిల జోలికెళ్లాలంటేనే భయపడాలి... మీడియాతో అనూహ్య తండ్రి
టీసీఎస్ టెక్కీ, తెలుగు అమ్మాయి ఎస్తేర్ అనూహ్యపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన చంద్రభాన్ కు ముంబై సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుపై అనూహ్య తండ్రి జోనాథాన్ ప్రసాద్ హర్షం ప్రకటించారు. తీర్పు వెలువడిన వెంటనే తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ముంబై కోర్టు తీర్పు తమకు సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ తీర్పును చూసైనా ఇకపై అమ్మాయిల జోలికి వెళ్లాలంటే ఆకతాయిలు భయపడాలని ఆయన వ్యాఖ్యానించారు. అమాయకులైన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ముంబై కోర్టు తీర్పు స్పష్టం చేసిందన్నారు. తన కూతురుపై హత్యాచారానికి పాల్పడ్డ చంద్రభాన్ ను తాను తొలిసారి ముంబై పోలీస్ స్టేషన్ లోనే చూశానని ఆయన చెప్పారు. ఆ సమయంలో అతడిని చూసిన తనకు ఎందుకోగాని కోపం రాలేదని ప్రసాద్ పేర్కొన్నారు. నేరం చేశానన్న పశ్చాత్తాపం గాని, భయం కానీ చంద్రభాన్ లో కనిపించలేదని కూడా ప్రసాద్ చెప్పారు. చంద్రభాన్ లాంటి నేరగాళ్లకు ఉరి శిక్షే సరైందని ఆయన వ్యాఖ్యానించారు.