: నరేంద్ర మోదీ మరిచిన ఆ మహా నేత పేరును ఆఫ్రికా నేతలు గుర్తు చేసుకున్న వేళ!
ఢిల్లీలో భారత్, ఆఫ్రికా దేశాల సదస్సు అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. భారత ఉపఖండం, ఆఫ్రికా ఖండాల మధ్య సత్సంబంధాలు పెరిగాయంటే, గతంలో ఇండియాను పాలించిన నేతల ప్రాతినిధ్యం ఎంతో ఉందనడంలో సందేహం లేదు. అందునా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషి కచ్ఛితంగా సంస్మరణీయం. కానీ, ఈ సదస్సు ముగింపు సందర్భంగా మోదీ తన ప్రసంగంలో ఆయన పేరును స్మరించకపోవడం కొత్త చర్చకు దారితీసింది. వేదిక వెనుక వైపున్న భారీ తెరలపై భారత్, ఆఫ్రికా దేశాల నేతలను చూపుతూ నెహ్రూ చిత్రాన్ని సైతం పలుమార్లు ప్రదర్శించారు. కానీ, మోదీ మాత్రం తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ఆయన్ను గుర్తు చేసుకోలేదు. ఇక సదస్సుకు హాజరైన ఆఫ్రికా దేశాధినేతలందరూ తమ ప్రసంగాల్లో నెహ్రూ పేరును ప్రస్తావించడం గమనార్హం. గాంధీ, మండేలాలు సహా పలువురు నేతలు నైజీరియా, ఈజిప్టు రచయితల పేర్లను స్మరించుకున్న మోదీ, నెహ్రూను మరచిన వేళ, జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, మొరాకో రాజు కింగ్ మహమ్మద్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి వంటి వారెందరో ఆయనను తలచుకున్నారు. మోదీ కావాలనే నెహ్రూ పేరు పలకలేదన్న చర్చ ఇప్పుడు మొదలైంది.