: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యం
తెలంగాణలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు నిరాశలో ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుండటమే దీనికి కారణం. తాజాగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాదికి వాయిదా పడిందన్న వార్తలు వెలువడుతుండటంతో... గులాబీ తమ్ముళ్లు మరింతగా నిరాశలోకి జారుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ, ఏదో ఒక కారణం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతోంది. దసరా పండుగ సందర్భంగా పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. దీంతో ఈ పోస్టులను ఆశిస్తున్న గులాబీ తమ్ముళ్లు దసరా పండుగ వచ్చిందని ఆనందంలో మునిగిపోయారు. కానీ, దసరాకు పదవుల పందేరం లేదని, పండుగ తర్వాత ఉంటుందని తేలింది. ప్రస్తుతం పండుగ పోయి చాలా రోజులయినప్పటికీ ఆ ఊసే లేదు. ప్రస్తుతం వరంగల్ ఉప ఎన్నిక, ఆ తర్వాత నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఉండటంతో... నామినేటెడ్ పదవుల భర్తీ అంశాన్ని కేసీఆర్ తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం. ఈ సమయంలో పోస్టులను భర్తీ చేస్తే... పార్టీలో వర్గ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని... అది ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతుందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. అందువల్లే పోస్టుల భర్తీని జాప్యం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.