: నగల వ్యాపారికి బ్యూటీషియన్ యలమంచిలి నందిని టోకరా...అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు


హైదరాబాదులో ప్రముఖ బ్యుటీషియన్ గా పేరుగాంచిన యలమంచిలి నందిని చౌదరి ఓ నగల వ్యాపారికి టోకరా ఇచ్చారు. రూ.50 లక్షల విలువ చేసే నగలను అమ్మిపెడతానని తీసుకుని డబ్బివ్వకుండా ముఖం చాటేశారు. నందిని మోసంపై నగల వ్యాపారి నుంచి ఫిర్యాదునందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకెళితే... ప్రముఖ బ్యుటీషియన్ గా పేరొందిన యలమంచిలి నందిని చౌదరి జూబ్లీహిల్స్ రోడ్ నెం:72లో ‘బ్లష్ స్పా అండ్ సెలూన్’ ను నిర్వహిస్తున్నారు. అంతేకాక తన వద్దకు వస్తున్న సంపన్న మహిళలకు నగలను కూడా అమ్ముతున్నారట. ఈ క్రమంలో హుస్సేనీ ఆలంకు చెందిన నగల వ్యాపారి సోమేన్ ఘోష్ నుంచి రూ.50 లక్షల విలువ చేసే 5 నెక్లెస్ లు తీసుకున్న నందిని, వాటిని విక్రయించకుండా తన సొంతానికి వాడుకున్నారు. 5 నగల్లో రెండింటిని తనఖా పెట్టి రూ.10 లక్షల రుణం తీసుకున్న నందిని, మరో మూడు నెక్లెస్ లను అప్పులు తీర్చేందుకు వాడేసుకున్నారు. ఈ క్రమంలో సోమెన్ ఘోష్ కు డబ్బు చెల్లించడంలో ఆమె విఫలమయ్యారు. దీంతో సోమెన్ ఘోష్ పోలీసులను ఆశ్రయించారు. ఘోష్ ఫిర్యాదు మేరకు నందినిపై ఐపీసీ 420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News