: భజ్జీ పెళ్లి వద్ద కెమెరామెన్లపై బౌన్సర్ల దాడి...క్షమాపణ చెప్పిన టీమిండియా స్పిన్నర్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాహ వేడుక వద్ద నిన్న చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. నటి, మోడల్ గీతా బస్రాతో భజ్జీ పెళ్లి నిన్న పంజాబ్ లోని జలంధర్ లో అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. భజ్జీ భద్రతను పర్యవేక్షిస్తున్న బౌన్సర్లు వివాహ వేడుకను కవర్ చేస్తున్న కెమెరామెన్లపై దాడికి దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కెమెరామెన్లు పెళ్లి వేడుక ముందే నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న భజ్జీ పరుగు పరుగున అక్కడికి వచ్చి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. దాడి చేసిన బౌన్సర్ల తరఫున భజ్జీ క్షమాపణలు చెప్పడంతో కెమెరామెన్లు కూడా శాంతించి ఆందోళనను విరమించారు.