: దయ్యాలను పారద్రోలడం 'లైవ్'లో చూస్తారా? ఇవాళ యూఎస్ చానల్ ప్రత్యక్ష ప్రసారం!
ఏ టీవీ చానల్ చూసినా రియాల్టీ షోలు వెల్లువెత్తుతున్న వేళ, ఓ అమెరికన్ చానల్ మరో అడుగు ముందుకేసింది. డిస్కవరీ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్న 'డెస్టినేషన్ అమెరికా' అనే చానల్ లో "ఎక్జార్సిమ్: లైవ్!" పేరిట దయ్యాలను తరమడం, భూతవైద్యాన్ని చేయడం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమం శుక్రవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 8 గంటలకు) ప్రసారం కానుంది. రెండు గంటల పాటు సాగే ఈ లైవ్ షోకు వేదిక కానున్న ఆ భూత్ బంగళా ఏంటో తెలుసా? "ది ఎగ్జార్సిస్ట్" పేరిట ప్రపంచ సినీ ప్రేక్షకులను భయపెట్టిన చిత్రం తీసిన భవంతి! ఈ భవనం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. ఇక్కడ భూత శక్తి ఉందని ఎందరో ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రియాల్టీ షోలు చేసి టీవీ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన జోడీ టోవాయ్ ఈ లైవ్ లో స్వయంగా పాల్గొంటారు. "ఈ భవనం గురించిన ఎన్నో కథలు, మిస్టరీ చరిత్రలో దాగున్నాయి. అందుకే మా కార్యక్రమం వినూత్నమైనది" అని టోవాయ్ పేర్కొన్నారు. ఈ షోలో టోవాయ్ తో పాటు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఆ భవంతిలోకి అడుగు పెడతారు. దయ్యం ఆవహిస్తే, ఆ వ్యక్తికి అపరిమిత శక్తి వస్తుందని అందువల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులను కూడా తీసుకెళ్తున్నామని ఆమె తెలిపారు.