: మహిళా అభిమానులతో సెల్ఫీ దిగిన నటుడిని అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు
మహిళా అభిమానులతో సెల్ఫీలు దిగడం ఆ నటుడి తలకు చుట్టుకుంది. సౌదీ అరేబియాలో పేరున్న నటుడు, టీవీ యాంకర్ అబ్దుల్ అజీజ్ అల్-కస్సార్ ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే... కువైట్ లో నివసించే ఈ నటుడు ఓ షూటింగ్ నిమిత్తం రియాద్ కు వచ్చాడు. అక్కడి అల్ నకీల్ షాపింగ్ సెంటరులో అజీజ్ ను లేడీ ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అంతకుముందు ఆయన రియాద్ లో సందర్శించడానికి ఉత్తమ మాల్ ఏదని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాడు. ఆ మాల్ లో తనకు అభిమానుల నుంచి లభించిన స్వాగతానికి ముచ్చట పడ్డట్టు చెప్పుకున్నాడు. అతని చుట్టూ మహిళా అభిమానులు గుంగుగా చేరడాన్ని ఓ వ్యక్తి వీడియో తీయగా అది సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ వెంటనే మాల్ భద్రతా అధికారి ఒకరు అజీజ్ ను అక్కడి నుంచి లాక్కెళ్లిపోయాడు కూడా. పోలీసుల అరెస్ట్ అనంతరం బెయిలుపై విడుదలైన ఈ నటుడు ఇక సౌదీ చట్టాల ప్రకారం కేసు విచారణను ఎదుర్కోవాల్సి వుంది.