: యూజర్ల సమస్త వివరాలూ చేతుల్లో... గూగుల్, వాట్స్ యాప్, ఫేస్ బుక్ గూఢచర్యం!


యూజర్లకు చెందిన సమస్త సమాచారాన్ని గూగుల్, వాట్స్ యాప్, ఫేస్ బుక్ సంస్థలు దొంగిలిస్తున్నాయని, వారి ముందు వ్యాపార ప్రకటనలు ఉంచేందుకు ఏవి ఇష్టమో, ఏవి అయిష్టమో తెలుసుకుంటున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్ ఆరోపించింది. అయితే, యూజర్లకు కూడా తమ వివరాలు గూగుల్ తదితర సంస్థలకు చేరుతున్నాయన్న విషయం తెలుసునని అవాస్ట్ సీఈఓ విన్సెంట్ స్టెక్లర్ వెల్లడించారు. "గూగుల్ ఓ వ్యాపార ప్రకటనల సంస్థ. దాని ఆదాయం అంతా యాడ్ వర్డ్స్ కేంద్రంగా వస్తుంది. వారికి వ్యాపార ప్రకటనలు పంపేందుకు ఆ సంస్థ గూఢచర్యం చేస్తోంది" అని ఆయన అన్నారు. సైబర్ సెక్యూరిటీపై అవాస్ట్ కనుగొన్న విషయాలను గురువారం నాడు విడుదల చేసిన ఆయన, అనంతరం ప్రసంగిస్తూ, వాట్స్ యాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలూ గూగుల్ దారిలోనే నడుస్తున్నాయని ఆరోపించారు. యూజర్లు మాట్లాడుకునే మాటలను బట్టి ఇవి వ్యాపార ప్రకటనలను పంపుతున్నాయని ఆయన తెలిపారు. ఇదే విషయమై గూగుల్ ప్రతినిధిని వివరణ కోరగా, ఆ నివేదిక వివరాలు తామింకా చూడలేదని, దీనిపై కామెంట్ చేయబోమని అన్నారు. ఫేస్ బుక్ సైతం ఈ విషయంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్-100 మొబైల్ యాప్స్ లో 10 వరకూ యూజర్లు పంచుకుంటున్న చిత్రాలు, వీడియోలు, ఆడియో మెసేజ్ ల కాపీలను సేకరిస్తున్నాయని, ప్రతి 10 యాప్స్ లో 9 వరకూ స్మార్ట్ ఫోన్ లలోని స్టోరేజ్ లోకి వెళ్లగలుగుతున్నాయని విన్సెంట్ తెలియజేశారు.

  • Loading...

More Telugu News