: ప్రమాదం జరిగే వేళ... సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఏం చేయాలి? యజమానినే చంపితే...!
2035... 900 కోట్లను దాటిన ప్రపంచ జనాభా. సౌదీలో అయిపోయిన చమురు నిల్వలు. మార్స్ పైకి తొలి బ్యాచ్ వెళ్లిన వేళ... మీ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో 'ఐఫోన్ 37'లో చాట్ చేస్తూ వెళుతున్నారు. కారులోని మెషీన్ దానంతట అదే మిమ్మల్ని గమ్యస్థానం చేర్చేందుకు వేగంగా వెళుతోంది. ఆ సమయంలో కొందరు మనుషులు వేగంగా వీధిలోకి వచ్చారు. కారు వారిని ఢీకొనక తప్పదు. ఆర్టిఫీషియల్ బ్రెయిన్ ఉండే కారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? వారిని ఢీకొట్టాలా? లేక కారును టర్న్ చేసి పక్కనే ఉన్న గోడను ఢీకొనాలా? కారులో ఉన్న ఒకరి ప్రాణం ముఖ్యమా? రోడ్లపై నడుస్తున్న అంతకు మించిన ప్రాణాలు ముఖ్యమా? సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలి? ప్రస్తుతానికి ఇవి ఊహాజనిత ప్రశ్నలే అయినా, ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు యూనివర్శిటీ ఆఫ్ ఓరేగాన్, టలౌసీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సంయుక్తంగా ఓ అధ్యయనం చేసి నివేదిక వెల్లడించాయి. ఈ అధ్యయనంలో భాగంగా, కొన్ని ప్రశ్నలను ఈ బృందం అడిగింది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎంతమందిని కాపాడేందుకు యజమానిని బలిచేయవచ్చు? అన్నదే ప్రధాన ప్రశ్న, ఇదే సమయంలో కారులో మీరు డ్రైవర్ గా ఉంటే ఏం చేస్తారన్న ప్రశ్ననూ అడిగారు. పదిమంది ప్రాణాలను కాపాడేందుకు పక్కనే ఉన్న రెయిలింగ్ లేదా గోడ కాకుంటే మరొకదాన్ని ఢీకొట్టడం మేలని, ఈ కారణంతో కారు యజమాని మరణించినా ఫర్వాలేదని అత్యధికులు సమాధానం చెప్పారు. మూడోవంతు మాత్రం కారులోని పాసింజర్ పూర్తి రక్షణకు ఉండాల్సిన అన్ని రక్షణ ఏర్పాట్లనూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ సంస్థలు చేయాలని సూచించారు. కాగా, ప్రమాదం జరిగితే, యజమాని ప్రాణాలను తీసే నిర్ణయాన్ని తీసుకునేలా ప్రోగ్రామింగ్ చేయబడిన కారును మీరు కొంటారా? అని ప్రశ్నిస్తే మాత్రం అత్యధికులు 'కొనము' అని చెప్పడం గమనార్హం.