: తెలంగాణ కేడర్ కే కేటాయించమని ఎలా అడుగుతారు?... సోమేశ్ కుమార్ కి క్యాట్ ప్రశ్న
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న సోమేశ్ కుమార్ కు క్యాట్ లో నిరాశ ఎదురైంది. తెలంగాణ కేడర్ కే కేటాయించాలని ఏ విధంగా కోరతారని సోమేశ్ కుమార్ తరపు న్యాయవాదిని క్యాట్ ప్రశ్నించింది. తనను తెలంగాణ కేడర్ కే కేటాయించాలని... ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారి సోమేశ్ ఇప్పటికే క్యాట్ లో వ్యాజ్యం వేశారు. ఈ మేరకు మరోసారి దానిపై క్యాట్ సభ్యులు విచారణ జరిపారు. అఖిల భారత సర్వీసు అధికారులకు తాము ఫలానా ప్రాంతంలోనే పనిచేస్తామని కోరే చట్టబద్ధమైన హక్కు ఉండదని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ఈ సమయంలో క్యాట్ కు తెలిపారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను క్యాట్ కు సమర్పించారు. ఈ క్రమంలోనే క్యాట్ సోమేశ్ న్యాయవాదిని పైవిధంగా అడిగింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో మీ వాదనలను ఏ విధంగా సమర్థించుకుంటారో తెలపాలని కోరింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.