: అత్యద్భుతం ... ప్రపంచంలోని 250 కోట్ల మంది ప్రజలు ఇక్కడ కనిపిస్తున్నారు: మోదీ


భారత్, ఆఫ్రికా దేశాల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన 'ఇండో-ఆఫ్రికా సమ్మిట్ 2015' ముగింపు సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని మూడింట ఒకవంతు ప్రజలకు సదస్సు వేదికగా నిలిచిందని, తనకిక్కడ 125 కోట్ల మంది భారతీయులతో పాటు, 125 కోట్ల మంది ఆఫ్రికా ప్రజలు కనిపిస్తున్నారని, మొత్తం 250 కోట్ల మంది ఆశలను తీర్చి, వారిని భవిష్యత్తులోకి నడిపించే ఎన్నో నిర్ణయాలు ఈ సదస్సు తీసుకుందని అన్నారు. ఆఫ్రికాలో 20 శాతం ప్రజాప్రతినిధులు మహిళలేనని గుర్తు చేసుకున్న ఆయన, ఆఫ్రికా ఖండంతో పాటు, ఇండియాలో అత్యధికులు 35 సంవత్సరాల లోపు వారేనని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో అక్షరాస్యత మెరుగుపడుతోందని, అక్కడి యువత వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వలస పాలనలో ఉన్న ఇరు ప్రాంతాలూ స్వాతంత్ర్యం కోసం పోరాడాయని వెల్లడించిన ఆయన గాంధీ, మండేలా తదితరులను గుర్తు చేసుకున్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఆఫ్రికా, ఇండియాలున్నాయని, వచ్చే దశాబ్ద కాలంలో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం 70 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.5 లక్షల కోట్లు) పెరగనుందని, ఎన్నో ఆఫ్రికా ఉత్పత్తులు పన్నులు లేకుండా ఇండియాకు దిగుమతి చేసుకునేలా నిబంధనలు సవరించామని అన్నారు. ఇండియా ఉత్పత్తులకు సైతం ఆఫ్రికాలో మంచి ఆదరణ ఉందని వివరించారు. 2008లో తొలి ఆఫ్రికా-ఇండియా సదస్సు జరిగిందని, అప్పటి నుంచి జరిగిన అన్ని సదస్సులూ తమ ఫలాలను అందించాయని తెలియజేశారు. గత మూడేళ్లలో 25 వేల మంది యువ ఆఫ్రికన్లు ఇండియాలో శిక్షణ పొందారని తెలిపారు. తనకిక్కడ 250 కోట్ల మంది ప్రజలు కనిపిస్తున్నారని, వారి కలలను నెరవేర్చేలా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలని, వాటిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యాటకం విషయాల్లో ఆఫ్రికా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోందని, వాటిని తామూ అమలు చేస్తామని మోదీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News