: నిబంధనల మేరకే అభీష్ట నియామకం...రఘువీరా ఆరోపణలను తిప్పికొట్టిన ఏపీ సీఎంఓ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓఎస్డీగా నియమితుడైన అభీష్ట నియామకంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంధించిన విమర్శలను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తిప్పికొట్టింది. నిబంధనల మేరకే అభీష్ట నియామకం జరిగిందని, ఇదంతా అధికారికంగానే జరిగిందని నిన్న సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనను విడుదల చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడైన అభీష్టను నిబంధనలకు విరుద్ధంగా సీఎం తన ఓఎస్డీగా నియమించుకున్నారని రఘువీరా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే రఘువీరా ఆరోపణల నేపథ్యంలో సీఎంఓ నిన్న పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది. అభీష్ట నియామకానికి సంబంధించిన ప్రతిపాదన ‘‘ఫైల్ నెంబరు:సి.నెం./ఓపీ2/2014’’లో ఉన్నట్లు సదరు ప్రకటనలో మీనా తెలిపారు.