: పాకిస్థాన్ సినిమాలో నటించనున్న తొలి భారతీయ నటి
పాకిస్థాన్ సినిమాలో భారతీయ నటి తొలిసారిగా నటించనుంది. గతంలో పాకిస్థాన్ సినిమాల్లో నసీరుద్దీన్ షా నటించగా, నటీమణులెవరూ ఆ సాహసం చేయలేదు. అయితే తాజాగా ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ ఓ పాకిస్థాన్ సినిమాలో నటించే అవకాశం కనపడుతోంది. పాకిస్థాన్ దర్శకుడు షోయబ్ మన్సూర్ ఖాన్ తీయబోయే సినిమా కోసం కరీనా కపూర్ ఖాన్ ను సంప్రదించాడు. కరీనా కోసమే ఆ పాత్రను రూపొందించినట్టు చెప్పిన మన్సూర్ ఖాన్, అంతర్జాలం వేదికగా ఆ సినిమా కథను కరీనాకు వినిపించాడట. దీనిపై ఆసక్తి చూపిన కరీనా కథా చర్చల కోసం త్వరలో దుబాయ్ వెళ్లనుంది. కథనచ్చితే నటించే విషయంపై అధికారికంగా ట్వీట్ చేస్తుందని బాలీవుడ్ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పాకిస్థాన్ సినిమాల్లో నటించిన తొలి భారతీయ నటిగా కరీనా కపూర్ ఖాన్ నిలుస్తుంది. కాగా, పాకిస్థాన్ కు సంబంధించిన చాలా మంది నటీనటులు భారతీయ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పోతే, కరీనా ప్రస్తుతం 'కా అండ్ కీ' సినిమాలో నటిస్తోంది. మరోవైపు ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ నటించిన ఏజెంట్ వినోద్, ఫాంటమ్ సినిమాలను పాకిస్థాన్ లో నిషేధించిన విషయం తెలిసిందే.