: విరాళాలతో మరింత అభివృద్ధి కాబోతున్న విశాఖ కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కళాశాల


విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్), ఆంధ్ర మెడికల్ కళాశాల మరింత అభివృద్ధి కాబోతున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ రెండింటికీ విశాఖలో పలు సంస్థలు భారీ విరాళాలు ప్రకటించాయి. ఓఎన్జీసీ, సెయిల్, రిలయన్స్, విశాఖ స్టీల్ వంటి సంస్థలు మొత్తం రూ.60 కోట్లు ఇస్తామని ముందుకొచ్చాయి. వాటితో అత్యంత పురాతన సముదాయాలైన కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కళాశాల భవనాలను పూర్తిగా కూల్చేసి కొత్త భవనాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎంఎస్ఐడీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. దాని ప్రకారం కింగ్ జార్జి ఆసుపత్రిని ఏడు అంతస్తుల్లో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నారు. క్రిటికల్ కేర్, రేడియోథెరపీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. 3వ అంతస్తులో 90 పడకలతో కేన్సర్ శస్త్రచికిత్సల విభాగాన్ని, 4వ అంతస్తులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, దాంతో పాటు అనెస్థీషియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక 6వ అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, 7వ అంతస్తులో 300 మంది సామర్థ్యంతో సమావేశ హాల్, నగదు చెల్లించే అతిథుల కోసం ప్రత్యేక గదులు కూడా నిర్మించనున్నట్టు ఏపీ ఎంఎస్ఐడీసీకి చెందిన ఓ అధికారి వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తు వరకూ రేడియేషన్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్, న్యూక్లియర్ మెడిసిన్ వంటి విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ భవన నిర్మాణాలకు రూ.65 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే ఇంతవరకు ప్రకటించిన అరవై కోట్లకు మరో 5 కోట్లు అవసరం అవుతాయి. కేజీహెచ్ ఏడంతస్తుల ఆసుపత్రి భవనంపై హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేబట్టే అవకాశముందని సమాచారం.

  • Loading...

More Telugu News