: ఫేస్ బుక్ కు భారత్ ప్రధానమైన మార్కెట్: జుకర్ బర్గ్
సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ కు భారత్ ప్రధానమైన మార్కెట్ అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. భారత్ లో పర్యటిస్తున్న ఆయన ఇవాళ ఢిల్లీలోని టౌన్ హాల్ లో 900 మంది ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జుకర్ మాట్లాడుతూ, భారత్ ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్ లో 130 మిలియన్ల ఫేస్ బుక్ వినియోగదారులున్నారని, ఎక్కువ ఫేస్ బుక్ వినియోగదారులున్న రెండో పెద్ద దేశం భారత్ అని తెలిపారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇంటర్నెట్ తో అనుసంధానం చేస్తేనే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని అనుసంధానించటం సాధ్యమవుతుందని చెప్పారు. ఇంటర్నెట్.ఆర్గ్ ద్వారా 15 మిలియన్ల మందిని ఆన్ లైన్ లోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రపంచంలో నాలుగు బిలియన్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదన్న జుకర్, ప్రతి ఒక్కరినీ ఇంటర్నెట్ తో అనుసంధానం చేయటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.