: ఎస్... భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చాం: ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ మద్దతిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. 1990లో కాశ్మీర్ లో వేర్పాటువాద కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత లష్కరే తోయిబా సహా 12 ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయని... వాటికి పాకిస్థాన్ మద్దతు ప్రకటించడమే కాక, శిక్షణ కూడా ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, తాలిబన్లకు శిక్షణ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పంపించామని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం లక్వీ, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులు హీరోలుగా చెలామణి అయ్యారని చెప్పారు. ఆల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్, జవహరి, తాలిబాన్ల వంటి వారిని పాకిస్థాన్ హీరోలుగా భావించేదని అన్నారు. అయితే, పాకిస్థాన్ లోని మతతత్వ పోరాటం ఇప్పుడు ఉగ్రవాదంగా మారిందని ముషారఫ్ అన్నారు. వీరంతా సొంత ప్రజలనే చంపుతున్నారని చెప్పారు. దీన్ని తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒకప్పుడు హీరోలుగా చెలామణి అయిన లాడెన్, జవహరి వంటి వారు ఆ తర్వాత విలన్లుగా మారారని అభిప్రాయపడ్డారు. ముషారఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తుండటమే కాక, పాక్ ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టాయి.

  • Loading...

More Telugu News