: ప్రధానితో ప్రత్యేక భేటీ కుదర్లేదు... నేటి సాయంత్రం హైదరాబాదుకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావాలన్న ఆశ నెరవేరలేదు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మొన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్, నీతి ఆయోగ్ కమిటీ సభ్యులతో కలిసి నిన్న మోదీని కలిశారు. నీతి ఆయోగ్ కమిటీ నివేదికను పలు రాష్ట్రాల సీఎంలతో కలిసి కేసీఆర్ ప్రధానికి అందజేశారు. అనంతరం ఆయన ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కావాలని యోచించారు. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా అక్కడ ఉండటంతో ఈ భేటీ సాధ్యపడలేదట. డిసెంబర్ లో తాను చేపట్టనున్న ఆయుత చండీయాగానికి రావాలని మోదీని ఆహ్వానించాలని కేసీఆర్ భావించారు. అయితే ప్రత్యేక భేటీ సాధ్యపడని నేపథ్యంలో మోదీని ఆహ్వానించకుండానే కేసీఆర్ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. నేటి పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్ లతో భేటీ కానున్న కేసీఆర్ సాయంత్రం హైదరాబాదుకు తిరిగిరానున్నారు.