: ఇక కేఈ, కొనకళ్ల వంతు... వియ్యంకులు కానున్న టీడీపీ సీనియర్లు
టీడీపీ నేతలు, చంద్రబాబు కేబినెట్ లో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు ఇప్పటికే బంధువులైపోయారు. గంటా కొడుకుతో నారాయణ కూతురు వివాహం ఖరారైపోయింది. మొన్న రాత్రి ఈ వివాహానికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం హైదరాబాదులో వేడుకగా జరిగింది. తాజాగా టీడీపీలో సీనియర్ నేతలుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి, కొనకళ్ల నారాయణ వియ్యంకులు కాబోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఈ కృష్ణమూర్తి ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఆయన చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రి. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గతేడాది దాకా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేఈ పనిచేయగా, తాజాగా ఆ పదవికి కొనకళ్ల ఎంపికయ్యారు. కేఈ సోదరుడు జయచంద్రుడి కూతురు మహితను కొనకళ్ల రెండో కుమారుడు చైతన్యకిచ్చి వివాహం చేసేందుకు రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. వచ్చే నెల 2న నిశ్చితార్థం, డిసెంబర్ లో పెళ్లి నిర్వహించనున్నాయి. ఇదే విషయాన్ని కేఈ, కొనకళ్ల సీఎం చంద్రబాబుకు చెప్పగా, ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారట.