: చోటా రాజన్ ది లొంగుబాటే!...నమ్మినోళ్లే మోసం చేయడంతో లొంగిపోక తప్పలేదట!
20 ఏళ్ల సుదీర్ఘ వేట తర్వాత ఎట్టకేలకు మాఫియా డాన్ చోటా రాజన్ పోలీసులకు చిక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఒంటరిగా ఇండోనేసియా నగరం బాలికి వచ్చిన రాజన్ ను అక్కడి పోలీసులు పట్టేశారు. అయితే రాజన్ ది అరెస్ట్ కాదని, లొంగుబాటేనన్న వాదన వినిపిస్తోంది. 20 ఏళ్లుగా ఓ వైపు పోలీసుల వెతుకులాట, మరోవైపు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజం చోటా షకీల్ వేట నేపథ్యంలో చోటా రాజన్ దాదాపుగా అవసాన దశకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద ఒక్క అనుచరుడూ లేడని నిఘా వర్గాల సమాచారం. ఇక ఐదేళ్లుగా అనారోగ్యంతో సతమతమవుతున్న చోటా రాజన్ డయాలసిస్ చేయించుకుంటూ కాలం నెట్టుకొస్తున్నాడని విశ్వసనీయ వర్గాల భోగట్టా. తనను మట్టుబెట్టేందుకు చోటా షకీల్ నిత్యం వేట సాగిస్తున్న నేపథ్యంలో తన అనుచరులే షకీల్ కు సమాచారం చేరవేశారని రాజన్ కు తెలిసిపోయింది. రాజన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన అతడి వంట మనిషి మిత్యా అతడి ఆచూకీని దావూద్ గ్యాంగ్ కు చేరవేశాడు. ఇక దుబాయ్ లో ఓ హోటల్ ప్రారంభించాలని యత్నించిన రాజన్ ముఖ్య అనుచరులు రవి, విమల్ రత్తేసర్ లకు చోటా షకీల్ వ్యూహాత్మకంగా సాయం చేశాడు. దీంతో వారిద్దరూ రాజన్ ఆనుపానులను షకీల్ కు చేరవేశారు. ఈ నేపథ్యంలో షకీల్ నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు లొంగిపోవడమొక్కటే మార్గమని రాజన్ భావించాడు. ఈ క్రమంలో అతడు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించి లొంగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఆస్ట్రేలియా నగరం సిడ్నీ నుంచి సింగిల్ గానే బాలి వచ్చాడని కూడా తెలుస్తోంది.