: ఇలాగైతే... రాజీమానా చేస్తా!: రాయపాటి సంచలన వ్యాఖ్య


గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారంపై అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి నెలకొందని, ఇకపైనా ఇలాగే జరిగితే తన ఎంపీ పదవికి రాజీనామా చేసేస్తానని ఆయన హెచ్చరించారు. నిన్న గుంటూరులో వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన రాయపాటి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని రాయపాటి వాపోయారు. తన నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య ఇబ్బంది పెడుతోందని, అధికారులు స్పందించని కారణంగా తాను తన సొంత డబ్బుతో ట్యాంకర్లను ఏర్పాటు చేయించానని ఆయన మంత్రికి తెలిపారు. అధికారుల తీరులో మార్పు రాకుంటే తాను రాజీనామా చేస్తానని రాయపాటి సమావేశం పోడియం వద్దకు వచ్చి మరీ నిరసన గళం విప్పారు. మంత్రికి సర్దిచెప్పిన ప్రత్తిపాటి అక్కడికక్కడే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, ఎంపీ పేర్కొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News