: రైతులకు రాయితీపై రెయిన్ గన్స్ ఇస్తాం: మంత్రి ప్రత్తిపాటి
రైతులకు రాయితీపై త్వరలో రెయిన్ గన్స్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లాలోని జగ్గాపురం, యడ్లపాడు గ్రామాల్లో రూ.1.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను కాపాడుకునే నిమిత్తం రైతులకు రెయిన్ గన్స్ ను రాయితీపై ఇస్తామన్నారు. కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి రైతులకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం రెయిన్ గన్స్ ను కొనుగోలు చేయనుందన్నారు. కాగా, శాసన సభలో ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై మంత్రి ప్రత్తిపాటి మండిపడ్డారు. టీడీపీని అడ్డుకోవడం నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే కాలేదు, ఇక జగన్ వల్ల ఏమవుతుందంటూ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం జగన్ వల్ల కాదన్నారు.