: రవిశాస్త్రి నన్ను అవమానపరిచారు... బీసీసీఐకి వాంఖడే క్యురేటర్ కంప్లైంట్
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది. మొన్నటి ముంబై మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైతే, అందుకు కారణం నీవేనంటూ వాంఖడే పిచ్ క్యురేటర్ సుధీర్ నాయక్ పై టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి చిందులేశారు. చెన్నై పిచ్ మాదిరిగా స్పిన్ కు అనుకూలించే పిచ్ తయారు చేయమంటే, మీరేం చేశారంటూ కాస్త కటువుగానే నాయక్ పై శాస్త్రి శివాలెత్తారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి నోటి వెంట బూతు పురాణం కూడా వినిపించిందట. దీనిపై మనసు నొచ్చుకున్న సుధీర్ నాయక్ అప్పటికప్పుడే ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి సారించిన ఎంసీఏ, రవిశాస్త్రి వ్యవహారంపై బీసీసీఐకి ఫిర్యాదు చేయాల్సిందేనని తీర్మానించింది. దీంతో కొద్దిసేపటి క్రితం రవిశాస్త్రిపై నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. నాయక్ ఫిర్యాదును స్వీకరించిన బీసీసీఐ తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. రవిశాస్త్రి చెప్పిన మేరకు పిచ్ ను స్పిన్ కు అనుకూలంగా మార్చేందుకు చర్యలు చేపట్టినా సమయాభావం వల్ల కుదరలేదని విశ్వసనీయ సమాచారం. దీనిపై వివరణ ఇచ్చేందుకు నాయక్ యత్నించినా, రవిశాస్త్రి వినిపించుకోలేదట. అనవసరంగా నోరు పారేసుకున్న రవిశాస్త్రిపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.