: వందలాది నగ్న వీడియోలు, న్యూడ్ ఫొటోలు... కృపామణి ఉదంతంలో కొత్త కోణాలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో తల్లిదండ్రులు, సోదరుడు, ఓ రౌడీ షీటర్ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కృపామణి ఘటనలో మరిన్ని కఠోర సత్యాలు వెలుగు చూశాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు బాసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. కృపామణిపై వేధింపులకు పాల్పడ్డ రౌడీ షీటర్ శ్రీనివాస్ ఇంటిని నిన్న పోలీసులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఇంటిలో లభించిన ఓ పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని చూసి పోలీసులే నివ్వెరపోయారట. సదరు చిన్నపాటి పెన్ డ్రైవ్ లో వందలాది నగ్న వీడియోలతో పాటు న్యూడ్ ఫొటోలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయట. అంటే, ఒక్క కృపామణిపైనే కాక పెద్ద సంఖ్యలో మహిళలను శ్రీనివాస్ వేధించినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లైంది. ఇక శ్రీనివాస్ తో కృపామణి తల్లి జరిపిన సంభాషణలకు సంబంధించి ఆడియో సాక్ష్యాలు కూడా పోలీసుల చేతికి చిక్కాయట. ఇదిలా ఉంటే ఇప్పటికీ శ్రీనివాస్ గాని, కృపామణి తల్లిదండ్రుల ఆచూకీ గాని లభ్యం కాలేదు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.