: 'కాంగ్రెస్ + ఆవు = ఎన్డీయే': అరుణ్ శౌరి


ఇండియాను పాలిస్తున్న మోదీ నేతృత్వంలోని ఎన్డీయే విధానాలకు, గతంలో పాలించిన కాంగ్రెస్ కు పెద్దగా తేడా ఏమీ లేదని, కాంగ్రెస్ కు ఓ ఆవు వచ్చి కలిసి ఎన్డీయేగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, మోదీ గత సన్నిహితుడు అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ టీఎన్ నినన్ రచించిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా జరిగిన చర్చా కార్యక్రమంలో అరుణ్ శౌరి మాట్లాడారు. మోదీ సర్కారుకు ఒక దిశ ఉన్నట్టు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. మోదీకన్నా మన్మోహన్ తెలివైన వాడని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అరుణ్ శౌరి ఈ వ్యాఖ్యలు చేస్తున్న వేళ సభికుల్లో మన్మోహన్ సింగ్ కూడా కూర్చుని ఉండటం విశేషం. ఎన్డీయే, యూపీఏ విధానాలు ఒకటేనని, ఆర్థిక వ్యవస్థను నిర్వహించడమంటే, దానిపై నిత్యమూ వార్తల్లో హెడ్ లైన్స్ వస్తుంటే చాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. అత్యంత బలహీనమైన ప్రధాని కార్యాలయం మోదీ ఆఫీసేనని అన్నారు. ఇండియాలోని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని చెబుతూ, "ప్రధానిని కలుస్తున్న పారిశ్రామికవేత్తలు వాస్తవాలు మాట్లాడడం లేదు. దయచేసి ఏమైనా చేయాలని కోరుతున్నారు. ఆపై బయటకు వచ్చి ప్రభుత్వానికి 10కి 9 మార్కులిస్తున్నట్టు మీడియా ముందు చెప్పి వెళ్లిపోతున్నారు" అని చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు మోదీ రోజుకో రకం యుద్ధాన్ని చేయాలని అనుకుంటున్నారని, అందుకు బదులుగా, ఒకే రకం యుద్ధం చేస్తూ, ప్రజలందరినీ కలుపుకు పోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News