: ఇక ‘జడ’ సైకోగాడు... విశాఖ మహిళలకు దడ పుట్టిస్తున్న దుండగుడు


‘సైకో’ సూదిగాడి భయం ఇంకా తెలుగు రాష్ట్రాలను వీడలేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో సిరంజిలతో మెరుపు దాడులు చేస్తున్న దుండగులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. సైకో సూదిగాడి కోసం పోలీసులు ఇంకా గాలింపు జరుపుతున్నారు. తాజాగా విశాఖలో ‘జడ’ సైకోగాడు ఎంటరయ్యాడు. షేరింగ్ ఆటోల్లో ప్రయాణించే మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుంటున్న ‘జడ’ సైకోగాడు గుట్టు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇప్పటికే పలువురు బాధితులు తమ జడలు మాయమైన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారట. షేరింగ్ ఆటోల్లో ఆడవారి పక్క సీటు పైనే మక్కువ చూపే ఈ సైకోగాడు డ్రైవర్ పక్కన సీటున్నా అస్సలు పట్టించుకోడు. ఆటో ఎక్కగానే, మాటల్లో పడిపోయే మహిళల జడలపై కత్తెరతో దాడి చేసే సదరు సైకో, బాధిత మహిళలకు ఇసుమంత స్పర్శ కూడా తగలకుండానే చాంతాడంత జడను కత్తిరించేసుకుని వెంట తెచ్చుకున్న బ్యాగులో వేసుకుంటాడు. వెంటనే ఏదో ఒక స్టాప్ లో అతడు దిగిపోతాడు. తీరా తమ స్టేజీలో ఆటో దిగిన మహిళలు జడ సవరించుకుని హడలెల్తిపోతున్నారు. కొందరైతే షాక్ కు గురై రోడ్డుపైనే స్పృహ కోల్పోయిన ఘటనలూ ఉన్నాయట. నగరంలోని గాజువాక ప్రాంతంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు ఇప్పటిదాకా అందిన ఫిర్యాదులు వెల్లడిస్తున్నాయి. మహిళల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సురేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడి నుంచి కత్తెర, మహిళల జడ నుంచి కత్తిరించిన వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా దాడులతో ప్రస్తుతం విశాఖ మహిళలు షేరింగ్ ఆటోలు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News