: చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సయోధ్యకు కారణమేంటంటే?...‘ఓటుకు నోటు’ నిందితుడి ఆసక్తికర కామెంట్
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో మరింతగా క్షీణించాయి. ఇరువర్గాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి. ఇరువురు సీఎంలు వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగా నిత్యం పోలీసు బాసులతో వరుస భేటీలు జరిపారు. అయితే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన పుణ్యమా అని వారిద్దరి మధ్య తిరిగి సత్సంబంధాలు నెలకొన్నాయి. దీనికి కారణమేంటన్న కోణంలో ఏ ఒక్కరికి అనుమానం రాలేదు. అయితే దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి, ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడు జెరూసలెం మత్తయ్య మాత్రం ఎవరూ అడగకుండానే కారణం చెప్పేశారు. క్రైస్తవుల ప్రార్థనల కారణంగానే ఇద్దరు సీఎంల మధ్య సయోధ్య కుదిరిందని నిన్న హైదరాబాదులో మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో మత్తయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసు రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసిందని ఆ ప్రకటనలో ఆయన చెప్పారు. అయితే తెలుగు ప్రజలు ఊహించని రీతిలో ఇద్దరు సీఎంల మధ్యే కాక టీఆర్ఎస్, టీడీపీల మధ్య సయోధ్య కుదిరిందన్నారు. ఈ ఆశ్చర్యం, అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి, క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు.