: గీతలోని స్వచ్ఛతకు కదిలిపోయిన మోదీ
దారి తప్పి పాకిస్థాన్ చేరుకొని, అక్కడ 15 ఏళ్ల పాటు గడిపిన గీతలోని స్వచ్ఛతకు ప్రధాని నరేంద్ర మోదీ కదిలిపోయారు. భారత్ కు చెందిన గీత 15 ఏళ్ల వయసులో పాక్ వెళ్లిపోయింది. దేశంకాని దేశంలో ఉన్నప్పటికీ ఆమె ఆహారపుటలవాట్లు కానీ, జీవన విధానం కానీ మారలేదు. దీనికి కారణం దేవుడు ఆమెను మూగ, బధిర బాలికగా పుట్టించడమే. ఆప్యాయత చూపితే అల్లుకుపోవడం, స్వచ్ఛంగా ఉండడం గీత నైజం. బాధకలిగితే పెద్దగా ఏడ్వడం ఆమెకు అలవాటు. అలాంటి గీత తల్లిదండ్రులను కలుసుకునేందుకు పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆమె కలిసింది. ఇలాంటి సందర్భాల్లో ప్రోటోకాల్ ఉంటుంది. భేటీ తరువాత తనను కలిసిన వారితో సెల్ఫీలు తీసుకోవడం ప్రధానికి సర్వసాధారణం. మోదీని కలుసుకున్నప్పుడు ఆయనకు ఆమె నమస్కరించింది. ప్రతిగా ఆయన ఆమెకు దీవెనలు అందించారు. 15 ఏళ్ల పాటు ఆమెను తమ బిడ్డలా పెంచిన 'ఈది ఫౌండేషన్' సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం చివర్లో చిన్నారి తన తండ్రిని అల్లుకుపోయినట్టు మోదీ చేతికి గీత అల్లుకుపోయింది. ఆ క్షణంలో స్వచ్ఛమైన గీతను చూసిన మోదీ మనస్పూర్తిగా నవ్వారు. భారత ప్రభుత్వం తరపున ఈది ఫౌండేషన్ కు కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.