: దీపావళిపై రకుల్, త్రిష, ఛార్మి, అనుష్క శర్మ, శ్రియ పోరాటం
దీపావళి పండగలో టపాసులు పేల్చడంపై సినీ నటీమణులు పోరాటం ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల్లో అవగాహన కల్పించేందుకు వినూత్నమైన ఫోటోలను పోస్టు చేస్తున్నారు. టపాసులు కాల్చడం ద్వారా భారీ ఎత్తున వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారని, దానిని నివారించాలని కోరుతున్నారు. పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే కాలుష్యం కారణంగా ఇప్పటికే ఎన్నో జంతువులు అంతరించిపోయాయని, మిగిలిన వాటిని సంరక్షించుకోవాలంటే కాలుష్యం తగ్గించాలని వారు సూచిస్తున్నారు. దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని పేర్కొంటున్న వారు, ఈసారి 'ఇగో' అనే టపాసును కాల్చాలని సూచిస్తున్నారు. 'ఇప్పటికే భూమికి సరిపడా ఇబ్బందులున్నాయని, టపాసులు పేల్చి మరో ఇబ్బందిని కలుగచేయవద్దని' సూచిస్తున్నారు. సరదా పేరిట కాల్చే టపాసుల వల్ల చిన్నపిల్లలు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడతారని, చిన్నపిల్లలు ఆ శబ్దాలకు ఉలిక్కిపడి భయపడతారని వారు సూచించారు. ఈ పోరాటం మొత్తాన్ని సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్, త్రిష, చార్మీ, అనుష్క శర్మ, శ్రియ తదితరులు సాగిస్తున్నారు. మరి వారి అభిమానులు దీపావళిని ఎలా నిర్వహించుకుంటారో చూడాలి.