: ఐదో వన్డేలో భారత్ ఓటమికి కారణం వాళ్లే!: గవాస్కర్
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు బౌలర్లే కారణమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. సఫారీలు చెలరేగి ఆడుతున్నప్పుడు బౌలర్లను పదేపదే మార్చకుండా ధోని కఠినంగా వ్యవహరించాడని విమర్శించాడు.'టీమిండియా బౌలింగ్ లో ఉన్న సౌలభ్యాన్ని ధోని ఉపయోగించుకోలేదు. మొదట్లో బౌలింగ్ ను కొంతమేర మార్చినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత బౌలింగ్ లో ఉన్న అవకాశాలను ధోని సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడంతోనే దక్షిణాఫ్రికా మరింత చెలరేగిపోవడానికి కారణం అయింది' అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో గెలిచి టీమిండియాపై సఫారీలు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచారు.