: రాజేంద్ర సదాశివ్ నికల్జీ అలియాస్ చోటా రాజన్ ఎలా దొరికాడంటే...!
"ఆస్ట్రేలియా పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారంతో మేము ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. ఇండియాలో జరిగిన 20 హత్యలతో ఇతనికి సంబంధముందని, 1995 నుంచి ఇంటర్ పోల్ వెతుకుతోందని తెలిసి ఆశ్చర్యపోయాం. ఇతని పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జీ" అని భారత పోలీసు అధికారులకు ఇండోనేషియా నుంచి సమాచారం అందగానే, ముంబై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజేంద్ర సదాశివ్ నికల్జీ పేరు వినగానే, అతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఒకప్పటి ప్రధాన అనుచరుడు చోటా రాజన్ గా అనుమానించారు. ఆ వెంటనే పట్టుబడింది చోటా రాజన్ అని ఖరారు చేసుకున్నారు. 55 ఏళ్ల రాజన్ దాదాపు 20 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాకు విమానంలో వచ్చిన అతనిని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. కాగా, దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్ విడిపోయి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత ఇరు వర్గాల మధ్య చాలా గొడవలు నడిచాయి. ఆ నేపథ్యంలోనే దావూద్ గ్యాంగ్ సభ్యుడొకడు చోటా రాజన్ కు సంబంధించిన సమాచారం ఆస్ట్రేలియన్ పోలీసులకు అందించి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా చోటా రాజన్ ను ఇండియాకు అప్పగించే అవకాశాలున్నాయని ఇంటర్ పోల్ అధికారులు వెల్లడించారు.