: మొహర్రం వేడుకల్లో ఏనుగు 'రజనీ'కి గాయాలు
హైదరాబాద్, పాతబస్తీలో జరిగే మొహర్రం వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచి, బీబీకా ఆలం ఉత్సవాల్లో పాల్గొన్న నెహ్రూ జూలాజికల్ పార్కు ఏనుగు రజనీ కాళ్లకు గాయాలయ్యాయని జూ అధికారులు వెల్లడించారు. మొహర్రం వేడుకల్లో పాల్గొన్న వేళ, యువకుల 'మాతం' వల్ల రహదారులపై చిందిన రక్తాన్ని చూసి రజనీ బెదిరిపోయిందని, వేగంగా అక్కడి నుంచి వెళ్లాలని భావించి, వడివడిగా అడుగులు వేయగా, కాళ్లకు కట్టివున్న ఇనుప సంకెళ్ల కారణంగా గాయపడిందని జూపార్క్ వెటర్నరీ ఆఫీసర్ హకీమ్ వెల్లడించారు. రజనీ మనసును వెంటనే కనిపెట్టిన మావటి, దాన్ని ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ, అదుపు తప్పకుండా జాగ్రత్తపడి ప్రమాదాన్ని నివారించాడని తెలిపారు. రజనీకి పూర్తి విశ్రాంతినిచ్చామని, అనుక్షణం కనిపెట్టి ఉంటున్నామని తెలిపారు.