: 'ఆడలేక మద్దెల ఓడు' అన్నట్టుగా రవిశాస్త్రి వాదన!
ముంబైలో భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనపై టీం డైరెక్టర్ రవిశాస్త్రి స్పందన 'ఆడలేక మద్దెల ఓడు' అన్నట్టుగా ఉంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు, సెంచరీలతో చెలరేగిపోయిన వేళ, ఒక్క భారత క్రికెటర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమై 214 పరుగుల భారీ ఓటమిని చవిచూడగా, అందుకు పిచ్ క్యూరేటర్ కారణమని రవిశాస్త్రి విమర్శించారట. ఈ విషయమై ముంబై క్రికెట్ అసోసియేషన్ క్యూరేటర్ సుధీర్ నాయక్, రవిశాస్త్రిల మధ్య ఘాటైన సంభాషణ జరిగిందని, దీనిపై బీసీసీఐకి సుధీర్ ఫిర్యాదు చేయనున్నాడని సమాచారం. క్యూరేటర్ వద్దకు వెళ్లిన రవిశాస్త్రి గొప్ప వికెట్ తయారు చేశావంటూ వ్యంగ్యంగా మాట్లాడగా, స్పందించిన సుధీర్, వికెట్ గురించి తనకు పాఠాలు చెప్పవద్దని, తాను కూడా భారత జట్టుకు ఆడానని గట్టిగానే సమాధానం చెప్పాడట. కాగా, పిచ్ కనీసం 350 పరుగులు సంపాదించేలా చూడాలని ముందే క్యూరేటర్ కు పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది.