: టీమిండియా ఘోర ఓటమి... సిరీస్ కైవసం చేసుకున్న సఫారీలు
వాంఖడే స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డే లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సఫారీల చేతిలో 214 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 36 ఓవర్లలో 224 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. 439 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట కొన్ని ఓవర్లు నిలకడగా ఆడినా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. సఫారీల కట్టుదిట్టమైన బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు ఆశించిన మేరకు పరుగులు కురిపించలేకపోయారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు భారీ లక్ష్యాన్ని భారత్ కు నిర్దేశించారు. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధవన్(60), అజింక్యా రహానే(87) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. విరాట్ కోహ్లి(7), సురేష్ రైనా(12), మహేంద్ర సింగ్ ధోని (27 ), అక్షర్ పటేల్ (5) లు స్వల్ప పరుగులకే పెవిలియన్ కు చేరడంతో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టెయిన్ కు మూడు, ఇమ్రాన్ తాహీర్ లకు రెండు వికెట్లు లభించాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదు వన్డే మ్యాచ్ లలో భారత్ రెండు, దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్ లు గెలిచాయి. దీంతో సిరీస్ ను సఫారీలు కైవసం చేసుకున్నారు.