: మహాకూటమిపై నిప్పులు చెరిగిన మోదీ ... ప్రధాని మాటలకు, చేతలకు పొంతన లేదన్న నితీష్
బీహార్ లో మహాకూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ కూటమిలో ముగ్గురు స్వార్థపరులున్నారని.. ఆ ముగ్గురు సోనియా, నితీష్, లాలూ అని ఆరోపించారు. గతంలో బీహార్ రాష్ట్రానికి వారు ఒరగబెట్టిందేమీ లేదని మోదీ విమర్శించారు. బీహార్ లోని నలందా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ, మహా కూటమి స్వార్థపరుల మయమని, రాష్ట్రానికి వారు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడమే కాక, వాటిని ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవంటూ నితీష్ విమర్శించారు. ప్రధాని మాటలకు, చేతలకు పొంతన లేదని, కొన్ని అంశాలపై మాట్లాడాల్సి వచ్చినా కూడా మోదీ మౌనంగా ఉంటున్నారని అన్నారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కల్పించడం వంటి ఎన్నో వాగ్దానాలను ప్రధాని మరచిపోయారని అన్నారు. దాద్రి, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి ఘటనలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ నితీష్ ప్రశ్నించారు.