: నాటి 'టైటానిక్' బిస్కెట్ ... ఖరీదు రూ. 15 లక్షలు!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇది. దానికి అంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ బిస్కెట్ 1912లో మునిగిపోయిన టైటానిక్ షిప్ లోనిది కాబట్టి. యూకేలో ఈ బిస్కెట్ ను వేలం వేస్తే, 15 వేల పౌండ్లు (సుమారు రూ. 14.98 లక్షలు) ధర పలికింది. టైటానిక్ మునిగిపోయినప్పుడు ఓ లైఫ్ బోటులోని సర్వైవల్ కిట్ లో ఉన్న కొన్ని బిస్కెట్ ప్యాకెట్ల నుంచి దీన్ని సేకరించామని వేలం వేసిన ఆండ్ర్యూ అల్ డ్రిడ్జ్ వెల్లడించారు. టైటానిక్ నుంచి ప్రాణాలతో బయటపడిన జేమ్స్ ఫెన్ విక్ అనే వ్యక్తి దాచుకున్న ఈ బిస్కెట్, తొలుత గ్రీస్ లోని ఓ కలెక్టర్ వద్దకు చేరిందని, దీని ధర 8 వేల నుంచి 10 వేల పౌండ్లు (రూ. 8.90 లక్షల నుంచి రూ. 9.80 లక్షలు) పలుకుతుందని అంచనా వేశామని ఆయన తెలిపినట్టు బీబీసీ ప్రకటించింది. అదే సమయంలో లైఫ్ బోటు నుంచి తీసిన 'మునిగిపోతున్న టైటానిక్' చిత్రం 21 వేల పౌండ్లు (సుమారు రూ. 21 లక్షలు) ధర పలికిందని తెలిపింది. కాగా సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టైటానిక్ షిప్ ఏప్రిల్ 14, 1912న ఓ మంచు కొండను ఢీకొని నీట మునగగా, 1,500 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.