: ఇక్కడే ఉంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో రఘువీరా, ఎలాగంటే!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బీహార్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ దాటకుండానే వీరి ప్రచారం సాగుతోంది. ఎలాగో తెలుసా? ఈ ఉదయం ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి నేతృత్వంలోని నాయకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో వినూత్న ప్రచారం మొదలు పెట్టారు. పాట్నా ఎక్స్ ప్రెస్ వద్దకు చేరుకున్న నేతలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని విమర్శిస్తూ, ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని రైల్లోని ప్రయాణికులకు కరపత్రాలను పంచారు. "మోదీ హఠావో, దేశ్ కో బచావో" అంటూ నినాదాలు చేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోదీ, మట్టి, నీరు చేతిలో పెట్టారని బీహార్ ప్రజలకు తెలిపిన రఘువీరా, ఆ పార్టీకి ఓట్లు వేయవద్దని రైల్లోని బీహారీలకు సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తదితర మహాకూటమిలో భాగంగా బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాగా, రఘువీరా ప్రచారాన్ని అడ్డుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.