: గెలిచేది బీజేపీయే... దళితులను 'కుక్కలు' అనడం పెద్ద వివాదం కాదన్న అరుణ్ జైట్లీ
బీహారులో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని ఆ పార్టీ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జోస్యం చెప్పారు. తొలి రెండు దశల ఎన్నికల్లో తమ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారని, మహాకూటమిలోని విభేదాలు ఆ పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయని ఆయన అన్నారు. ఆ పార్టీలను చూసి ప్రజలు భయపడుతున్నారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున, రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ చేసిన 'కుక్కలు' వ్యాఖ్యపై స్పందిస్తూ, అదేమీ పెద్ద వివాదం కాదని అన్నారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పారని గుర్తు చేసిన జైట్లీ, దీన్ని ప్రజలు మరచిపోయారని, అయినా, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం గుర్తు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఓ దళిత కుటుంబంపై కొందరు దాడి చేసి ఇద్దరు చిన్నారులను సజీవదహనం చేసిన తరువాత, "కుక్కలపై రాళ్లేస్తే రాద్ధాంతం ఎందుకు?" అన్న అర్థం వచ్చేలా వీకే సింగ్ వ్యాఖ్యానించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.