: వరంగల్ బరిలో బీజేపీ అభ్యర్థి... టీటీడీపీ, బీజేపీ సమావేశంలో నిర్ణయం
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ, బీజేపీ కూటమి తరపున ఎవరు బరిలోకి దిగుతారనే సస్పెన్స్ కు తెరపడింది. హైదరాబాదులోని గోల్కొండ హోటల్ లో టీటీడీపీ, బీజేపీ నేతల మధ్య జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో వరంగల్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థినే నిలపాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అయితే అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని తెలిపారు. దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఎన్డీయే అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ కూటమి- టీఆర్ఎస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉంటుందని తెలిపారు. బీజేపీ తరపున ఎవరిని పోటీలో నిలపాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని... తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, తమ అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ ఉప ఎన్నికలో ఎన్డీయే సత్తా ఏంటో చూపుతామని తెలిపారు.