: స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్... పంజాబ్ లో శాంతి నెలకొనాలని ప్రత్యేక పూజలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పొరుగు రాష్ట్రాల పర్యటనలకు తరచుగా వెళుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో గోమాంసం ఆరోపణలతో దారుణ హత్యకు గురైన ముస్లిం వ్యక్తి అఖ్లాక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన దాద్రీ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం కోటక్ పురా కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పంజాబ్ వెళ్లారు. పర్యటనలో భాగంగా పంజాబ్ లోని అమృత్ సర్ వెళ్లిన కేజ్రీవాల్ అక్కడి సిక్కుల సుప్రసిద్ధ ఆలయం స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. పంజాబ్ లో శాంతి సామరస్యం నెలకొనాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కోటక్ పురా వెళ్లిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు.