: తెలంగాణ శిశువుకు ‘అమరావతి’ పేరు... రూ.10 వేలిచ్చిన మాజీ మంత్రి కేఈ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన రోజున జన్మించిన ఆడ పిల్లలకు అమరావతి అని, మగ పిల్లలకు అమర్ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేఈ పిలుపు మేరకు అమరావతి శంకుస్థాపన రోజున కర్నూలు జనరల్ ఆసుపత్రిలో జన్మించిన ఇద్దరు ఆడ శిశువులకు వారి తల్లిదండ్రులు అమరావతి అనే పేరు పెట్టారు. సమాచారం అందుకున్న కేఈ అక్కడికి వెళ్లి ఇద్దరు చిన్నారులకు రూ.10 వేల చొప్పున బహుమతి ఇచ్చి వచ్చారు. ఈ ఇద్దరు పిల్లలో ఒకరు కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళ సుజాతకు జన్మించగా, మరో చిన్నారి మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన బాలిక కావడం విశేషం. కర్నూలు సరిహద్దు జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా వాసులు వైద్య చికిత్సల కోసం హైదరాబాదు కంటే కర్నూలునే ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో ఆ జిల్లాలోని అలంపూర్ కు చెందిన మహిళ కవిత ప్రసవం కోసం అమరావతి శంకుస్థాపనకు ముందు కర్నూలు జనరల్ ఆసుపత్రికి వచ్చింది. సరిగ్గా శంకుస్థాపన రోజుననే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కేఈ పిలుపునకు స్పందించిన ఆమె తన బిడ్డకు అమరావతి అనే పేరు పెట్టుకుంది.