: మోదీకి ‘మట్టి’ మూటలు... ‘మట్టి సత్యాగ్రహం’ పేరిట రఘువీరా వినూత్న నిరసన
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించని మోదీ... అమరావతి శంకుస్థాపనకు ఢిల్లీ మట్టి, యమునా నీటిని తీసుకొచ్చిన వైనంపై పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ‘మట్టి’ రాజకీయానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు ఆయన ‘మట్టి సత్యాగ్రహం’ చేపట్టారు. ఈ వినూత్న నిరసన కింద ఏపీలోని 16 వేల గ్రామాల నుంచి మట్టిని సేకరించి ప్రధాని నరేంద్ర మోదీకి కొరియర్ ద్వారా పంపనున్నట్లు రఘువీరా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తాము మట్టి సేకరిస్తున్న గ్రామాల జాబితాలో చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వగ్రామం చవటవారిపల్లి కూడా ఉన్నాయని తెలిపారు. అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టి మూటలను ప్రధానికి పోస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు. తొలి విడతగా గంగులవాయినపాలెం సర్పంచ్ లక్ష్మీదేవమ్మ సేకరించిన మట్టి మూటను మోదీకి పంపుతున్నామని ఆయన పేర్కొన్నారు.