: శ్రీని ఇంట మసాలా దోసె తిన్న ధోనీ... కుటుంబ విషయాలే చర్చించుకున్నారట!
టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న చెన్నైలో బీసీసీఐ మాజీ బాస్ ఎన్.శ్రీనివాసన్ ఇంటికెళ్లాడు. దీనిపై విమర్శలు ఎదురవుతాయని తెలిసినా, కెప్టెన్ కూల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. మొన్నటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన ఆనందంలో నిన్న మధ్యాహ్నం జట్టు సభ్యులంతా ముంబైకి బయలుదేరారు. అంతకుముందు నిన్న ఉదయం ఉన్నట్టుండి ధోనీ, శ్రీని ఇంటికి వెళ్లాడు. శ్రీనికి అత్యంత సన్నిహితంగా ఉండటమే కాక, ఆయన కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ఇండియా సిమెంట్స్ ఆధ్వర్యంలోని ఐపీఎల్ జట్టు 'చెన్నై సూపర్ కింగ్స్'కు ధోనీ ఆది నుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీని, ధోనీ మధ్య మంచి సంబంధాలే నెలకొన్నాయి. శ్రీని ఇంటికి వెళ్లిన ధోనీ టిఫిన్ చేశాడట. తెలుగు, తమిళ నేల సుప్రసిద్ధ అల్పాహారం మసాలా దోసెను ధోనీ ఆరగించాడట. ఆ తర్వాత ధోనీ కూతురు, కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను శ్రీని అడిగి తెలుసుకున్నారు. శ్రీనితో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమని ధోనీ ఆ తర్వాత మీడియాకు చెప్పాడు.